Telugu Kavithalu

This Blog contains various Telugu Kavithalu (poems) written by Tumma family members.....

Monday, May 31, 2010

రంపపు కోత




నల్లుల మంచంలో
నను బంధీని చేసి
కేళి విలాసంలో
నువ్వు గడుపుతుంటే
నీ చిన్ననాడు
నిను చూసిన సంఘటనలు
మసకగా పారాడుతున్నాయి
మాంసం ముద్దగా పుట్టిన
నీలో జీవం నిల్పేందుకు
మీ అమ్మ, నేను పడ్డ కష్టం ఎంతో!
ప్రకృతి శక్తుల తాకిడికి
ఎదురు నిల్చాం
అమ్మ నిన్ను ఉయ్యాలలో ఊపితే
నా వెన్ను వంచి
గుర్రాన్నై స్వారి చేశాను
ఉప్పు బస్తాగా మోసి
నిను ఆనందింప జేశాను
తిరునాళ్ళలో నీ చూపుడు వేలు
చూపిన ప్రతి వస్తువును కొన్నాను
మా కన్నీల్లనే తాగి
నీ కడుపును నింపాము
నీ మారామును
మమకారంతో తీర్చాము
నీకు జబ్బు చేస్తే
అహోరాత్రులు అఘోరించి
నిను దక్కించుకున్నం
ప్రతి పైసా కూడబెట్టి
నలుగురిలో పెద్దవాడిని చేస్తే
నీ గౌరవ ప్రతిష్టలను
ఈ ముడత దేహం
దెబ్బ తీస్తున్నాయని
పలుకైన కరువుజేసావు
అ - అమ్మ నుండి
ర - రంపము వరకు
ఓనమాలు నేర్పిన నన్ను
రంపంతో కోస్తున్నావు
ఇప్పుడు నేను
అశక్తుడిని

-- అంధ్ర ప్రభ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం 16-7-1989 లో ప్రచురింపడినది

----- తుమ్మ భాస్కర్

Tuesday, May 25, 2010

మనసు

మనసు విహంగమే
కాని ఎగరదు
మనసు కోతే
కాని చిలిపి చేష్టలు లేవు
బంధాలకు బంధీ

(ఆకాశవాణి తేది 23-3-1990)
------ ప్రసాద్ తుమ్మ

ప్రయాణం




నిన్నటి గిరులు తరులు
సుఖధుహ్ఖలు మీటుకుంటూ
కొండల్లో కోనల్లోన
పరువపు నయాగారాల పాన్పులపై దొర్లుతూ
ప్రయనిస్తూనే ఉంది
వీధి వెంబడి అడుక్కునే ముసలి
వీధి చివర కవ్వించే కన్నె పిల్ల
చిరునవ్వుతో పలకరించే పుస్తకాలు
కిటికిలోంచి గుసగుసలాడే గుల్ మూహర్
అన్ని గుర్తుకొస్తున్నాయి
కాని నేను ప్రయాణించే బాట
ఇరుకైనది లోతైనది
ఎక్కడికో తెలియనిది
కాని!
ప్రయానిస్తూనే ఉంది
నిరంతరం
నా అంతరంగం

(ఆకాశవాణి తేది 23-3-1990)
----- ప్రసాద్ తుమ్మ

మరణం

నేనేం కోరుకుంటానో నాకు తెలియదు
అది ఎన్నాళ్ళు గుర్తుంచుకోను
నా జీవితకాలంలో
నీడనే చూస్తాను
ఆశ్చర్యకరంగా ఆరాటపడుతుంటాను
దేని కొరకు
దేనిని ఆహ్వానించాలి
ప్రేమ ? మరణమా?
మరణించిన మరణాన్నా?
నా హృదయంపై
ఆరాధకుల ప్రేమనా?
ప్రేమ పాదముద్ర పడింది
దేనిని దేనిని
నా వెన్నుపై మరచిన పూర్వీకుల
మరనారణ్యం మొలిచింది

(ఆకాశవాణి తేది 23-3-1990)
------ ప్రసాద్ తుమ్మ

అంతరంగం

మొదటి మాటల్లోనే
మునిగి తేలిపోవడం
ప్రేమ
మరికొందరంటారు
మనస్సులోని సదభిప్రాయమే
ప్రేమ
జీవితపు చివరి మజిలీ
చీకటి అలల అంచు
మరణం
మరికొందరంటారు
ముసుగులోని ముద్దాయి

------ ప్రసాద్ తుమ్మ

స్త్రీ

ఆమె
నన్ను వలచిన చిన్నది
గుండెలపై తన్ని
కడుపుకోత మిగిల్చింది
ఈమె
నన్ను కన్నా తల్లి
గుండెలపై హత్తుకొని
కడుపులోన దాచుకొన్నది

(ఆకాశవాణి తేది 23-3-1990)
----- ప్రసాద్ తుమ్మ

ప్రేమ





మనసిచ్చిన
మగువయినా మర్చిపోతుంది
కాని
మనసులో మనసయి
తనువులో తనువాయి
అణువులో అనువయి
క్షణం క్షణం క్షణంలో
నీవుంటూ
నే మరచిపోతున్న
నీవు మరువక నా వెంట ఉంటూ
నన్ను ప్రతిక్షణం నే వైపుకు మరల్చుకుంటూ
ప్రేమనే అమ్రతాన్ని గ్రోల
నన్ను నే వైపుకు మేల్కొల్పుతున్న
నీకేమి ప్రతిఫలమివ్వగలను
నీవందించే ప్రేమను తప్ప

(ఆకాశవాణి తేది 23-3-1990 )
------ ప్రసాద్ తుమ్మ