
నల్లుల మంచంలో
నను బంధీని చేసి
కేళి విలాసంలో
నువ్వు గడుపుతుంటే
నీ చిన్ననాడు
నిను చూసిన సంఘటనలు
మసకగా పారాడుతున్నాయి
మాంసం ముద్దగా పుట్టిన
నీలో జీవం నిల్పేందుకు
మీ అమ్మ, నేను పడ్డ కష్టం ఎంతో!
ప్రకృతి శక్తుల తాకిడికి
ఎదురు నిల్చాం
అమ్మ నిన్ను ఉయ్యాలలో ఊపితే
నా వెన్ను వంచి
గుర్రాన్నై స్వారి చేశాను
ఉప్పు బస్తాగా మోసి
నిను ఆనందింప జేశాను
తిరునాళ్ళలో నీ చూపుడు వేలు
చూపిన ప్రతి వస్తువును కొన్నాను
మా కన్నీల్లనే తాగి
నీ కడుపును నింపాము
నీ మారామును
మమకారంతో తీర్చాము
నీకు జబ్బు చేస్తే
అహోరాత్రులు అఘోరించి
నిను దక్కించుకున్నం
ప్రతి పైసా కూడబెట్టి
నలుగురిలో పెద్దవాడిని చేస్తే
నీ గౌరవ ప్రతిష్టలను
ఈ ముడత దేహం
దెబ్బ తీస్తున్నాయని
పలుకైన కరువుజేసావు
అ - అమ్మ నుండి
ర - రంపము వరకు
ఓనమాలు నేర్పిన నన్ను
రంపంతో కోస్తున్నావు
ఇప్పుడు నేను
అశక్తుడిని
-- అంధ్ర ప్రభ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం 16-7-1989 లో ప్రచురింపడినది
----- తుమ్మ భాస్కర్
No comments:
Post a Comment