Telugu Kavithalu

This Blog contains various Telugu Kavithalu (poems) written by Tumma family members.....

Sunday, March 6, 2011

స్నేహం



ఈ దినం
సుదినం
నూతన వత్సరం
ప్రతి ఉదయం
మన హృదయం
పరితపించే స్పందనం
స్నేహం స్నేహం

ప్రతి ఉత్తరం
ప్రతి అక్షరం
చేసే కలవరం
దినదిన ప్రవర్ధమానం
మన స్నేహం మన స్నేహం

విశాలం ప్రపంచం
అందులో మనం
మనలో స్నేహం
కావాలి అది
స్నేహ జగత్తుకు ఆదర్శం

- ప్రసాద్ తుమ్మ...

Monday, October 11, 2010

చిట్టి కవితలు

మార్పు

లార్వా దశ లేనిది
సీతాకోక చిలుక లేదు
కాలగమన మార్పు లేనిదే
మనిషి మనుగడ లేదు

పద్ధతి

భూమిలోన విత్తనం నాటి
నీరు పోయకున్న ఫలితమేమి
ఎన్ని చదువులు చదివినా
క్రమశిక్షణ లేని జీవితమేమి


తప్పు దారి

చేతిలోన పరీక్ష పుస్తకం
తలలోన సినిమాలు సీరియల్సు
చిత్తం శివుని మీద
భక్తి చెప్పుల మీద

మాయా జగత్తు

వేషాలు లేకుండా
నాటకాలు లేవు
మాయ మాటలు లేని
జగమే లేదు

----- తుమ్మ భాస్కర్

Sunday, September 5, 2010

ప్రమాదం




మనసనే మకరందంపై
కాలమనే గరళం పడినా
మనసుకే ప్రమాదం
కాలమనే గరళం పై
మనసనే మకరందం పడినా
మనసుకే ప్రమాదం

------- తుమ్మ ప్రసాద్

Saturday, September 4, 2010

ఓ అందం

ఓ అందం
నీకెంతో గర్వం
ప్రకాశించే తారలలో
పొందుపడాలనుకుంటావు
వెలగలేక మలగలేక బాధతో
కొట్టుమిట్టాడ్తుందని నీకేం తెల్సు
గల గల పారే ప్రవాహంలో
గంభీరంలా పొంగే సముద్రంలో
నీ నీడ చుడాలనుకుంటావు
కాని!!
ఆ సముద్రం బడబాగ్నులతో
ఎలా ఘోశిస్తుందో నీకేం తెల్సు
నిర్మలంగా సాగే ప్రవాహానికి
ఎన్ని అడ్డంకులో నీకేం తెల్సు
కనిపించే జగతిలో
కమనీయ దృశ్యాలలో
చోటు చేసుకోవాలనుకుంటావు
కాని!!
జగతి నిండా ఆకలి ఘోషలు
కనలేని వినలేని అతర్కమైన దష్యాలు
ఉన్నాయని నీకేం తెల్సు
నవనాగరికంలో
వలువలు విలువలు కోల్పోతుంటే
సిగ్గు నిసిగ్గుగా
నియాన్ లైట్ల వెలుతుర్లో
ఎలకొండ్ల చక్కలిగింతలు
పావురాయి పలవరింతలు
రోడ్డంతా చిమ్మింది
వెన్నెముకని కవుగిలించుకున్న చర్మం
ప్లస్ శూన్యంలోకొచ్చిన పొట్ట
ఈజ్ ఈక్వల్ టు ? ప్రశ్నే !!!

----- తుమ్మ ప్రసాద్

Monday, May 31, 2010

రంపపు కోత




నల్లుల మంచంలో
నను బంధీని చేసి
కేళి విలాసంలో
నువ్వు గడుపుతుంటే
నీ చిన్ననాడు
నిను చూసిన సంఘటనలు
మసకగా పారాడుతున్నాయి
మాంసం ముద్దగా పుట్టిన
నీలో జీవం నిల్పేందుకు
మీ అమ్మ, నేను పడ్డ కష్టం ఎంతో!
ప్రకృతి శక్తుల తాకిడికి
ఎదురు నిల్చాం
అమ్మ నిన్ను ఉయ్యాలలో ఊపితే
నా వెన్ను వంచి
గుర్రాన్నై స్వారి చేశాను
ఉప్పు బస్తాగా మోసి
నిను ఆనందింప జేశాను
తిరునాళ్ళలో నీ చూపుడు వేలు
చూపిన ప్రతి వస్తువును కొన్నాను
మా కన్నీల్లనే తాగి
నీ కడుపును నింపాము
నీ మారామును
మమకారంతో తీర్చాము
నీకు జబ్బు చేస్తే
అహోరాత్రులు అఘోరించి
నిను దక్కించుకున్నం
ప్రతి పైసా కూడబెట్టి
నలుగురిలో పెద్దవాడిని చేస్తే
నీ గౌరవ ప్రతిష్టలను
ఈ ముడత దేహం
దెబ్బ తీస్తున్నాయని
పలుకైన కరువుజేసావు
అ - అమ్మ నుండి
ర - రంపము వరకు
ఓనమాలు నేర్పిన నన్ను
రంపంతో కోస్తున్నావు
ఇప్పుడు నేను
అశక్తుడిని

-- అంధ్ర ప్రభ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం 16-7-1989 లో ప్రచురింపడినది

----- తుమ్మ భాస్కర్

Tuesday, May 25, 2010

మనసు

మనసు విహంగమే
కాని ఎగరదు
మనసు కోతే
కాని చిలిపి చేష్టలు లేవు
బంధాలకు బంధీ

(ఆకాశవాణి తేది 23-3-1990)
------ ప్రసాద్ తుమ్మ

ప్రయాణం




నిన్నటి గిరులు తరులు
సుఖధుహ్ఖలు మీటుకుంటూ
కొండల్లో కోనల్లోన
పరువపు నయాగారాల పాన్పులపై దొర్లుతూ
ప్రయనిస్తూనే ఉంది
వీధి వెంబడి అడుక్కునే ముసలి
వీధి చివర కవ్వించే కన్నె పిల్ల
చిరునవ్వుతో పలకరించే పుస్తకాలు
కిటికిలోంచి గుసగుసలాడే గుల్ మూహర్
అన్ని గుర్తుకొస్తున్నాయి
కాని నేను ప్రయాణించే బాట
ఇరుకైనది లోతైనది
ఎక్కడికో తెలియనిది
కాని!
ప్రయానిస్తూనే ఉంది
నిరంతరం
నా అంతరంగం

(ఆకాశవాణి తేది 23-3-1990)
----- ప్రసాద్ తుమ్మ