
రాత్రంతా నిద్ర లేదు
మాష్టర్ అప్పగించిన పని కాలేదు
కట్టుకుంది సగం గుడ్డే అయినా
గుడ్డ నేచే పని ఇంకా కాలేదు
చంటిది ఏడ్చి ఏడ్చి అలసి పోయింది
ముసల్ది రాట్నం వడికీ వడికీ
మూలన పడింది
ఇంటావిడ ఆసు త్రిప్పి త్రిప్పి
కాళ్ళు బార్లా జాపింది
సరిజేద్దామంటే జీవితానికే సరిలేదు
అంతా శ్రమదోపిడి
ఫలితం శూన్యం
దుహ్ఖాశ్రిత బాధలు
పొట్ట వెన్నెముకను కౌగిలించుకుంటుంది
ఆర్తిగా ఆబగా
కండ్లలో ఒయాసిస్సు
తను నేసిన బట్ట
తనకే లోపించిన కచ్చడం
శైశవ చలికి
చంటిదాని నుదిటిపై ఓ నవ్వు
తాము నేసిన గొంగళి
తమకు కరువై
పాలరాతి మేడలోని పాపకు రక్షనై
మళ్లీ ఓ చిరునవ్వు
ఇంటిది కాచిన గంజి
నూలు నానబెట్టదానికే సరి పోయింది
శరీరాలు కప్పడానికి తాను నేతగాడు
తన బ్రతుకు భారానికి?
ప్రశ్న పరుగెడుతుంది
టక్....టక్....టక్....
మగ్గం చప్పుడు కాదు
తన గుండె చప్పుడు
భవిష్యత్ అంతా భయంకరం
అడుగేద్దామంటే ఎదురు అగాధం
నూలు లేదు ధర లేదు కనీసం ఆత్మహత్యకు
పట్టి పట్టి ప్రత్తి కొనబోతే
నాణ్యత వెటకారం చేస్తుంది
గుంటలో దిగి నేచి నేచి
గుంటలోనే కూరుకుపోయింది జీవితం
వెన్నెముకను కౌగిలించుకుంది పొట్ట
ప్రశ్న!!!
(మూసీ ప్రచురణ )
---- ప్రసాద్ తుమ్మ
No comments:
Post a Comment