
గుర్రం బగ్గీల నుండి
ఎడ్ల బళ్ల నుండి
బస్సుగా ఎదిగిన నేను
రోజుకు ఎందరెందరినో
ఎచ్చట్టేచ్చటికో
చేరుస్తున్నానాను
దొరో, దొంగో
భీరువో, బిచ్చగాడో
దేశభక్తుడో, దేశద్రోహో
మగ, మగువ
పిల్లా, పిడుగు
ఏ తేడాను ప్రశ్నించక
పరిమితికి మించి కూడా
గమ్యాన్ని చేర్చడంలో
ఎంతగా అలసిపోతున్నానో
ఒకరికి ఆఫీసుకు టైమయిందని
వేరొకరికి పరీక్ష టైమయిందని
ఇంకొకరికి లవరు ఎదురు చూస్తున్నారని
ఎవరి తొందర వారిదే
అయినా
అందరిని అర్ధం చేసుకొని
వేగం ప్రధానం కాదు
గమ్యం చేర్చటం విధిగా
మసలుకుంటూ
ప్రజాసేవ చేస్తున్న నన్ను
ఎరుదాతగానే తెప్ప తగల బెట్టినట్లు
నడిరోడ్డున నడుము విరగ కొడుతున్నారు
దేశంలో ఎవరికి కోపమొచ్చినా
ధరలు పెరిగినా
ప్రభుత్వాన్ని కూల్చాలని
మంత్రికి కాబినెట్ హొదా ఇవ్వకపోయినా
ఎన్కౌంటర్లు జరిగినా
ఆయా వర్గాలలో కలహాలోచ్చినా
విద్యార్ధులు, విప్లవకారులు
కార్మికులు, కర్షకులు
మహిళలు, మేధావులు
దారిన వెళ్ళే దానయ్య
అల్లుడు అలిగాడని
అతని కోరికలు తీర్చలేని
మామలు
ఆఖరకు బిచ్చగాడు సహితం
నా కళ్ళను కర్రలతో పొడుస్తున్నారు
రాళ్ళతో రక్త మయం చేస్తున్నారు
కరుణ లేకుండా తగుల బెడుతున్నారు
చేతులెత్తి మీ అందరిని
ఆలోచింపమని అభ్యర్ధిస్తున్నాను
అత్త మీది కోపం
దుత్త మీద చూపకండి
మిమ్మల్ని గమ్యాన్ని చేర్చే నన్ను
కొట్టకండి, చంపకండి
మీ కాళ్ళను నరుకుకోకండి
29-11-90 న 7:45 AM కు ఆకాశవాణి హైదరాబాదులో ప్రసారితమైనది
----- తుమ్మ భాస్కర్
బస్సు అవేదన గురించిన మీ కవిత చాలా బాగుందండి!
ReplyDelete