Telugu Kavithalu

This Blog contains various Telugu Kavithalu (poems) written by Tumma family members.....

Monday, October 11, 2010

చిట్టి కవితలు

మార్పు

లార్వా దశ లేనిది
సీతాకోక చిలుక లేదు
కాలగమన మార్పు లేనిదే
మనిషి మనుగడ లేదు

పద్ధతి

భూమిలోన విత్తనం నాటి
నీరు పోయకున్న ఫలితమేమి
ఎన్ని చదువులు చదివినా
క్రమశిక్షణ లేని జీవితమేమి


తప్పు దారి

చేతిలోన పరీక్ష పుస్తకం
తలలోన సినిమాలు సీరియల్సు
చిత్తం శివుని మీద
భక్తి చెప్పుల మీద

మాయా జగత్తు

వేషాలు లేకుండా
నాటకాలు లేవు
మాయ మాటలు లేని
జగమే లేదు

----- తుమ్మ భాస్కర్

Sunday, September 5, 2010

ప్రమాదం




మనసనే మకరందంపై
కాలమనే గరళం పడినా
మనసుకే ప్రమాదం
కాలమనే గరళం పై
మనసనే మకరందం పడినా
మనసుకే ప్రమాదం

------- తుమ్మ ప్రసాద్

Saturday, September 4, 2010

ఓ అందం

ఓ అందం
నీకెంతో గర్వం
ప్రకాశించే తారలలో
పొందుపడాలనుకుంటావు
వెలగలేక మలగలేక బాధతో
కొట్టుమిట్టాడ్తుందని నీకేం తెల్సు
గల గల పారే ప్రవాహంలో
గంభీరంలా పొంగే సముద్రంలో
నీ నీడ చుడాలనుకుంటావు
కాని!!
ఆ సముద్రం బడబాగ్నులతో
ఎలా ఘోశిస్తుందో నీకేం తెల్సు
నిర్మలంగా సాగే ప్రవాహానికి
ఎన్ని అడ్డంకులో నీకేం తెల్సు
కనిపించే జగతిలో
కమనీయ దృశ్యాలలో
చోటు చేసుకోవాలనుకుంటావు
కాని!!
జగతి నిండా ఆకలి ఘోషలు
కనలేని వినలేని అతర్కమైన దష్యాలు
ఉన్నాయని నీకేం తెల్సు
నవనాగరికంలో
వలువలు విలువలు కోల్పోతుంటే
సిగ్గు నిసిగ్గుగా
నియాన్ లైట్ల వెలుతుర్లో
ఎలకొండ్ల చక్కలిగింతలు
పావురాయి పలవరింతలు
రోడ్డంతా చిమ్మింది
వెన్నెముకని కవుగిలించుకున్న చర్మం
ప్లస్ శూన్యంలోకొచ్చిన పొట్ట
ఈజ్ ఈక్వల్ టు ? ప్రశ్నే !!!

----- తుమ్మ ప్రసాద్

Monday, May 31, 2010

రంపపు కోత




నల్లుల మంచంలో
నను బంధీని చేసి
కేళి విలాసంలో
నువ్వు గడుపుతుంటే
నీ చిన్ననాడు
నిను చూసిన సంఘటనలు
మసకగా పారాడుతున్నాయి
మాంసం ముద్దగా పుట్టిన
నీలో జీవం నిల్పేందుకు
మీ అమ్మ, నేను పడ్డ కష్టం ఎంతో!
ప్రకృతి శక్తుల తాకిడికి
ఎదురు నిల్చాం
అమ్మ నిన్ను ఉయ్యాలలో ఊపితే
నా వెన్ను వంచి
గుర్రాన్నై స్వారి చేశాను
ఉప్పు బస్తాగా మోసి
నిను ఆనందింప జేశాను
తిరునాళ్ళలో నీ చూపుడు వేలు
చూపిన ప్రతి వస్తువును కొన్నాను
మా కన్నీల్లనే తాగి
నీ కడుపును నింపాము
నీ మారామును
మమకారంతో తీర్చాము
నీకు జబ్బు చేస్తే
అహోరాత్రులు అఘోరించి
నిను దక్కించుకున్నం
ప్రతి పైసా కూడబెట్టి
నలుగురిలో పెద్దవాడిని చేస్తే
నీ గౌరవ ప్రతిష్టలను
ఈ ముడత దేహం
దెబ్బ తీస్తున్నాయని
పలుకైన కరువుజేసావు
అ - అమ్మ నుండి
ర - రంపము వరకు
ఓనమాలు నేర్పిన నన్ను
రంపంతో కోస్తున్నావు
ఇప్పుడు నేను
అశక్తుడిని

-- అంధ్ర ప్రభ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధం 16-7-1989 లో ప్రచురింపడినది

----- తుమ్మ భాస్కర్

Tuesday, May 25, 2010

మనసు

మనసు విహంగమే
కాని ఎగరదు
మనసు కోతే
కాని చిలిపి చేష్టలు లేవు
బంధాలకు బంధీ

(ఆకాశవాణి తేది 23-3-1990)
------ ప్రసాద్ తుమ్మ

ప్రయాణం




నిన్నటి గిరులు తరులు
సుఖధుహ్ఖలు మీటుకుంటూ
కొండల్లో కోనల్లోన
పరువపు నయాగారాల పాన్పులపై దొర్లుతూ
ప్రయనిస్తూనే ఉంది
వీధి వెంబడి అడుక్కునే ముసలి
వీధి చివర కవ్వించే కన్నె పిల్ల
చిరునవ్వుతో పలకరించే పుస్తకాలు
కిటికిలోంచి గుసగుసలాడే గుల్ మూహర్
అన్ని గుర్తుకొస్తున్నాయి
కాని నేను ప్రయాణించే బాట
ఇరుకైనది లోతైనది
ఎక్కడికో తెలియనిది
కాని!
ప్రయానిస్తూనే ఉంది
నిరంతరం
నా అంతరంగం

(ఆకాశవాణి తేది 23-3-1990)
----- ప్రసాద్ తుమ్మ

మరణం

నేనేం కోరుకుంటానో నాకు తెలియదు
అది ఎన్నాళ్ళు గుర్తుంచుకోను
నా జీవితకాలంలో
నీడనే చూస్తాను
ఆశ్చర్యకరంగా ఆరాటపడుతుంటాను
దేని కొరకు
దేనిని ఆహ్వానించాలి
ప్రేమ ? మరణమా?
మరణించిన మరణాన్నా?
నా హృదయంపై
ఆరాధకుల ప్రేమనా?
ప్రేమ పాదముద్ర పడింది
దేనిని దేనిని
నా వెన్నుపై మరచిన పూర్వీకుల
మరనారణ్యం మొలిచింది

(ఆకాశవాణి తేది 23-3-1990)
------ ప్రసాద్ తుమ్మ

అంతరంగం

మొదటి మాటల్లోనే
మునిగి తేలిపోవడం
ప్రేమ
మరికొందరంటారు
మనస్సులోని సదభిప్రాయమే
ప్రేమ
జీవితపు చివరి మజిలీ
చీకటి అలల అంచు
మరణం
మరికొందరంటారు
ముసుగులోని ముద్దాయి

------ ప్రసాద్ తుమ్మ

స్త్రీ

ఆమె
నన్ను వలచిన చిన్నది
గుండెలపై తన్ని
కడుపుకోత మిగిల్చింది
ఈమె
నన్ను కన్నా తల్లి
గుండెలపై హత్తుకొని
కడుపులోన దాచుకొన్నది

(ఆకాశవాణి తేది 23-3-1990)
----- ప్రసాద్ తుమ్మ

ప్రేమ





మనసిచ్చిన
మగువయినా మర్చిపోతుంది
కాని
మనసులో మనసయి
తనువులో తనువాయి
అణువులో అనువయి
క్షణం క్షణం క్షణంలో
నీవుంటూ
నే మరచిపోతున్న
నీవు మరువక నా వెంట ఉంటూ
నన్ను ప్రతిక్షణం నే వైపుకు మరల్చుకుంటూ
ప్రేమనే అమ్రతాన్ని గ్రోల
నన్ను నే వైపుకు మేల్కొల్పుతున్న
నీకేమి ప్రతిఫలమివ్వగలను
నీవందించే ప్రేమను తప్ప

(ఆకాశవాణి తేది 23-3-1990 )
------ ప్రసాద్ తుమ్మ

Saturday, April 17, 2010

వీడని హృదయం





ప్రేమొక పాశానమని తెల్సినా
ఈ హృదయం నీ చెంతకే పరుగెడుతుంది
ప్రేయసీ!
నీవు నింగిలా కన్పించినా
ఎండమావిలా భ్రమించినా
అరణ్య రోదనయై ఘర్శించినా
ఎగురుతూ వస్తుందీ హృదయం

నీవు అహంకారం ప్రదర్శించినా
అందరిని అశని పాతానివైనా
మారుమూల దాగినా
నీ నేస్తాన్ని కొరుకున్తున్దీ హృదయం

ఆశలు నిరాశాలై
ఆవేదనలు వేదనలై
విశ్వాసం అవిశ్వాసమైన
ప్రేమ కోసం పరితపిస్తుంది హృదయం

ప్రేమ నరకంలో
మనసులు మాది సమాదులైన
గుండెలెన్నో చరిత్రలో ఉన్నా
నిను వీడుటకు శక్తి లేనిదీ హృదయం

నీవు అందని ద్రాక్షపండువి
సాహసం లేని పిరికిదానివి
సజల నయనాలతో
ప్రపంచాన్ని చూసే నీ కోసం
శలభమై ఈ గుండె రగిలి పోతూ ఉన్నా
నీలో ఐక్యమై పొవలనుకున్తున్దీ హృదయం

ఈ కవిత ఆకాశవాణి హైదరాబాదు నందు తేది. 13-5-1991 న రాత్రి 8:30 గంటలకు కవితావాహినిలో ప్రసారమైనది


----- తుమ్మ భాస్కర్

విద్యుత్తు





విద్యుత్తును నమ్ముకుంటే
ఇద్దత్తును అమ్ముకోవాల్సిందే
తాను అందరికి చుట్టానని
తాను లేకుంటే ఎవరికి పబ్బం గడవదనేమో
మరీ మనిషితో, మిషనుతో
ఆడుకుంటున్నది
తీరిగ్గా ముచ్చటిన్చుకున్దామని
వీధి దీపం కింద చేరగానే
టపీమని చీకటిని మీదేస్తుంది
సంవత్సరమంతా స్త్రైకులతో పోరిన విద్యార్ధులు
పరీక్ష ముందైనా పుస్తకాలు తెరిచేసరికి
కళ్ళకు మసిబూస్తూ తుర్రుమంటుంది
తిరిగి తిరిగి వచ్చి
ఇంట్లో కడుగు బెట్టేసరికి
తాను వెళుతుంది
పోత పోయిందని దీపం వెలిగించేసరికి
పోటీగా మరల వస్తుంది
వచ్చిందని దీపాన్ని ఆర్పితే
మళ్లీ మాయమవుతుంది
తాను వెళ్లిందని దొంగతనంగా
సరససల్లాపాలాడుకునే ప్రేమికులను
పరుగున వచ్చి పట్టేస్తుంది
దోమలతో తనకు
ఏ శిఖరాగ్ర మహాసభలో ఒడంబడికోగాని
మనిషి పక్క మీదకు చేరగానే
తాను వెళ్లి వాటిని
యుద్ధానికి పురికొల్పుతుంది
మీటింగులలో ఈటింగులలో
అంతా సిద్ధం చేసి
నోటి వద్ద కొచ్చేసరికి
పాడు చేస్తూ పారిపోతుంది
వార్తల కోసం
రేడియో ఆన్ చేయగానే
వార్తలు చదువుతున్నది
అంటూ ఆఫ్ అవుతుంది
ఎదురు చూడగా చూడగా
"ఈ వార్తలు ఇంతటితో సమాప్తం "
అని చెవిలోని జోరీగల వస్తుంది
సినిమా హాల్లో టెన్శానుగా ఫయిటింగును చూస్తున్న
ప్రేక్షకులను సస్పెన్సులో పెడుతుంది
ఉత్పత్తిని పెంచే మిషనుతో
మనిషి ముడిపడి యున్నాడనేమో
కార్మికులు శ్రమించే సమయానికే
లోవోల్తేజీతో కన్నుకోడుతూ
ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది
దీపం విలువ మరిచి
తనను ఆశ్రయించిన
మనిషి గుండెను పిండుతుంది
తనను నమ్ముకున్న
మనిషిని, మిషనును
వంచించడం న్యాయ సమ్మతమా!

------- తుమ్మ భాస్కర్

బస్సు ఆవేదన




గుర్రం బగ్గీల నుండి
ఎడ్ల బళ్ల నుండి
బస్సుగా ఎదిగిన నేను
రోజుకు ఎందరెందరినో
ఎచ్చట్టేచ్చటికో
చేరుస్తున్నానాను
దొరో, దొంగో
భీరువో, బిచ్చగాడో
దేశభక్తుడో, దేశద్రోహో
మగ, మగువ
పిల్లా, పిడుగు
ఏ తేడాను ప్రశ్నించక
పరిమితికి మించి కూడా
గమ్యాన్ని చేర్చడంలో
ఎంతగా అలసిపోతున్నానో
ఒకరికి ఆఫీసుకు టైమయిందని
వేరొకరికి పరీక్ష టైమయిందని
ఇంకొకరికి లవరు ఎదురు చూస్తున్నారని
ఎవరి తొందర వారిదే
అయినా
అందరిని అర్ధం చేసుకొని
వేగం ప్రధానం కాదు
గమ్యం చేర్చటం విధిగా
మసలుకుంటూ
ప్రజాసేవ చేస్తున్న నన్ను
ఎరుదాతగానే తెప్ప తగల బెట్టినట్లు
నడిరోడ్డున నడుము విరగ కొడుతున్నారు
దేశంలో ఎవరికి కోపమొచ్చినా
ధరలు పెరిగినా
ప్రభుత్వాన్ని కూల్చాలని
మంత్రికి కాబినెట్ హొదా ఇవ్వకపోయినా
ఎన్కౌంటర్లు జరిగినా
ఆయా వర్గాలలో కలహాలోచ్చినా
విద్యార్ధులు, విప్లవకారులు
కార్మికులు, కర్షకులు
మహిళలు, మేధావులు
దారిన వెళ్ళే దానయ్య
అల్లుడు అలిగాడని
అతని కోరికలు తీర్చలేని
మామలు
ఆఖరకు బిచ్చగాడు సహితం
నా కళ్ళను కర్రలతో పొడుస్తున్నారు
రాళ్ళతో రక్త మయం చేస్తున్నారు
కరుణ లేకుండా తగుల బెడుతున్నారు
చేతులెత్తి మీ అందరిని
ఆలోచింపమని అభ్యర్ధిస్తున్నాను
అత్త మీది కోపం
దుత్త మీద చూపకండి
మిమ్మల్ని గమ్యాన్ని చేర్చే నన్ను
కొట్టకండి, చంపకండి
మీ కాళ్ళను నరుకుకోకండి

29-11-90 న 7:45 AM కు ఆకాశవాణి హైదరాబాదులో ప్రసారితమైనది

----- తుమ్మ భాస్కర్

Wednesday, April 14, 2010

మనసు

ఒకరికిచ్చిన మనసు
ఆకర్షించే ఆ చిరునవ్వు
దూరమయితే
మనిషి మనసు కోరేది
నరకమేనని ఎందరికి తెలుసు

(ఆకాశవాణి 23-3-90)

---- ప్రసాద్ తుమ్మ

ఆక్రందన




మమ్మల్నెందుకిలా శిక్షిస్తారు?
మీకిది న్యాయమా?
ఒళ్ళంతా గాయాలపాలై
మంటల్లో మాడుతున్న దేహాలు
మీరంతా మాకు సమమే
కులమత లింగ వర్ణ వర్గ బేధాలు మాకు లేవు
అందరినీ మీ మీ గమ్య స్థానాలకు చేర్చే సాధనాలం
మేం చేసిన తప్పేంటి
మతం మందులో
కులం కుచ్చులలో చిక్కుకొని
మానవతవ్యం మంట గలిపి
మీరూ మీరూ రణరంగం సృష్టించుకొంటే
శిక్ష మాకా
మీ బందులకు మేం బలి
మీ కోపావేశాలకు మేం బలి
మీకు ఆనందం వచ్చినా
ఆవేశం వచ్చినా
మా దేహాలు ఆహుతవుతాయి
మీకిది న్యాయమా?
మీ గుండెను రాయి చేసుకొని
నా పై రాళ్ళు విసిరావే
గాయి పడింది
నీ తల్లి, చెల్లి
అది గ్రహించు
నరబలిని నిరసించే నీవు
ఈ బలికి పెట్టిన పేరేంటో?

---- ప్రసాద్ తుమ్మ

నిస్త్రింశము




రాత్రంతా నిద్ర లేదు
మాష్టర్ అప్పగించిన పని కాలేదు
కట్టుకుంది సగం గుడ్డే అయినా
గుడ్డ నేచే పని ఇంకా కాలేదు
చంటిది ఏడ్చి ఏడ్చి అలసి పోయింది
ముసల్ది రాట్నం వడికీ వడికీ
మూలన పడింది
ఇంటావిడ ఆసు త్రిప్పి త్రిప్పి
కాళ్ళు బార్లా జాపింది
సరిజేద్దామంటే జీవితానికే సరిలేదు
అంతా శ్రమదోపిడి
ఫలితం శూన్యం
దుహ్ఖాశ్రిత బాధలు
పొట్ట వెన్నెముకను కౌగిలించుకుంటుంది
ఆర్తిగా ఆబగా
కండ్లలో ఒయాసిస్సు
తను నేసిన బట్ట
తనకే లోపించిన కచ్చడం
శైశవ చలికి
చంటిదాని నుదిటిపై ఓ నవ్వు
తాము నేసిన గొంగళి
తమకు కరువై
పాలరాతి మేడలోని పాపకు రక్షనై
మళ్లీ ఓ చిరునవ్వు
ఇంటిది కాచిన గంజి
నూలు నానబెట్టదానికే సరి పోయింది
శరీరాలు కప్పడానికి తాను నేతగాడు
తన బ్రతుకు భారానికి?
ప్రశ్న పరుగెడుతుంది
టక్....టక్....టక్....
మగ్గం చప్పుడు కాదు
తన గుండె చప్పుడు
భవిష్యత్ అంతా భయంకరం
అడుగేద్దామంటే ఎదురు అగాధం
నూలు లేదు ధర లేదు కనీసం ఆత్మహత్యకు
పట్టి పట్టి ప్రత్తి కొనబోతే
నాణ్యత వెటకారం చేస్తుంది
గుంటలో దిగి నేచి నేచి
గుంటలోనే కూరుకుపోయింది జీవితం
వెన్నెముకను కౌగిలించుకుంది పొట్ట
ప్రశ్న!!!

(మూసీ ప్రచురణ )
---- ప్రసాద్ తుమ్మ

Tuesday, April 13, 2010

ప్రేయసి

ఆప్యాయతను అందించావు
అభిమానాన్ని పొందావు
ప్రేమను పంచావు
అనురాగంలో భంధించావు

నే ఆశించి
నా మనసుకు రెక్కలు తొడిగి
నే ఒడిలో వాలాను
ప్రేమ మకరందాన్ని ఆస్వాదిన్చేలోగా
పిరికితనంతో ముకుళించుకు పోయావు

---- తుమ్మ భాస్కర్

ప్రయాణం

రైలులో కాదు ప్రయాణం
స్థలం మీద కాదు
లేడీ మీద పరుగు
ఉదయం కనిపించిన
నుదుటి సూర్యబింబం
మరల సాయంత్రం కనిపించింది
ఉదయం వెనక సీటు
సాయంత్రం ఎదుటి సీటు
దాని బుగ్గపైని గాటు
నా గుండెపై హాటు
అందమైన ఆ వెన్నెలను
తాగాలని ఉంది
అపరిచుతులం
కృష్ణ (రైలు )
లయ విన్యాసాలతో పరుగెడుతుంది
బైట గాలికి
పవిట పెట పెటా లేచింది
దగ్గరలోనే మేరు పర్వతం
మబ్బు చాటున దాగి కనిపించింది
బాపు గీచిన బొమ్మ
ఇపుడే పెరుగుతున్న నునులేత కొమ్మ
ఎండిపోతున్న పెదాలు
నాలుకతో తడుపుకుంటున్నాయి
మస్తిష్కం మధన పడుతుంది
కీచుమన్న శబ్దం
చూపులు కలిసి ఆగి పోయిన కనురెప్పలు
మరో క్షణంలో
తరంగంలా వెనక్కి వెళ్ళాయి
జనాల పరుగులు
క్షణంలో
సాయంత్రపు సూర్యబింబం
అదృశ్యమయింది

--- తుమ్మ భాస్కర్

ధనం

ధనం మిదం జగత్
ధరనియే దనం చుట్టూ పరిభ్రమిస్తున్నది
డబ్బు లేనిదే
మంత్రసాని పిల్లను కననివ్వదు
డాక్టర్ కత్తెర్లను
కడుపులోనుండి తీయడు
డబ్బు లేనిదే
కాన్వెంట్లో అడ్మిషోను దొరకదు
దేవాలయంలో దర్శనం దొరకదు
ఎన్నికలలో సీటు దొరకదు
డబ్బు లేనిదే
గేటు దగ్గరి అటెండరు
ఆఫీసురు దర్శనమిప్పించాడు
మంత్రి గారు మాట్లాడరు
డబ్బు లేనిదే
ఆడపిల్ల అత్తగారింటికేల్లదు
నిరుద్యోగి ఉద్యోగి కాడు
పాలలో నీళ్ళు
బియ్యంలో రాళ్ళు
ఏ వస్తువులోనైన కల్తీ కలపడం
డబ్బు కోసమే
ప్రభుత్వాలు
పని చేయకపోయినా
పన్నులు విధించడం డబ్బు కోసమే
డబ్బు లేనిదే
ఓటరు ఓటు వేయడు
ఆఫీసులో ముద్ర పడదు
ఇంట్లో అన్నం ముద్ద పెట్టరు
డబ్బు లేనిదే
స్నేహితం లేదు
చుట్టరికం లేదు
ప్రేమకు స్థానం లేదు
కత్తులు ఝులిపించేది
రాజ్యాలను కూల్చేది
అంతరాలను అంతమొందించేది
డబ్బు కోసమే

--- తుమ్మ భాస్కర్

Thursday, February 11, 2010

ప్రమిద

నా మొదటి పుట్టిన రోజు సందర్భంగా మా నాన్నగారు నా కోసం రాసిన కవిత...

వెలుగు జిలుగులు
విరజిమ్మే చిన్నారి!
భవితవ్యంలో
లోకమంతా
నీ వెలుగు తోడ
నిండిపోవాలి,
నీ నడక సవ్వడి
దుర్మార్గపు చీకటిని
చీల్చాలి,
నీ కిల కిలా రావములు
అందరి మనసులలో
చిచ్చు బుద్లై వెలగాలి,
నీ అల్లరితనం
సంఘటిత శక్తిగా మారాలి,
నీ పలుకులు
చిలుకులై
బాదాదర్ప ధష్టులకు
ఓదార్పును కలిగించాలి,
నీ కూని రాగాలు
కోయిలలై
ఆవేదనా పరులకు
ఊరట కలిగించాలి,
నీ చూపులు
ప్రేమామృతాన్ని పంచివ్వాలి,
నీ భవిత్ విద్య
సమాజానికి ప్రయోజనంగా,
నీ చూపుడు వేలు
వాడియై
శత్రువుల గుండెలకు
బాకై నిలవాలి,
నీ కేకలు
కుల్లు సమాజంలో
రోదనయై
పతనం చేయాలి,
నీ చేష్టలు
సరికొత్త సమాజాన్ని
చిగురిమ్పజేస్తూ,
పెద్దల మన్ననలతో
ముందుకు
మృత్యువుకు వెరచక
మనోధైర్యoతో
సాగుతూ,
కలకాలం
వెలుగును ప్రసాదించే
'ప్రమిద 'వై
నిలవాలని
దీవిస్తున్న....

తుమ్మ భాస్కర్

Love you Dad...